||సుందరకాండ ||

||ముప్పది నాలుగవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ చతుస్త్రింశస్సర్గః

దుఃఖములో దుఃఖముతో నిండియున్న ఆమె వచనములను వినిన ఆ హనుమంతుడు ఆమెను ఓదార్చు వచనములతో ఇట్లు పలికెను.

'ఓ దేవి నేను రాముని దూతను. నీకు రాముని సందేశముతో వచ్చితిని. వైదేహీ కుశలముగానున్న రాముడు నీ యొక్క కుశలము అడుగుచున్నాడు. వేదములలో పారంగతుడు, బ్రహ్మాస్త్రముగురించి, వేదములగురించి తెలిసినవాడు అగు ఆ దాశరథి నీ కుశలము గురించి అడుగుతున్నాడు. నీ భర్త అనుచరుడు మహాతేజోవంతుడు అగు లక్ష్మణుడు శోకసంతాపముతో నీకు శిరసాభివందనము చేయుచున్నాడు'.

ఆ ఇద్దరు నరసింహుల కుశలము వినిన ఆ దేవి సమస్త అవయవములలో పొంగిన ఆనందముకలదై హనుమంతునితో ఇట్లు పలికెను. 'నరుడు వందసంవత్సరములు బతికినచో తప్పక ఆనందము పొందును అన్న లౌకికము ఎంత మంగళకరమో నాకు తెలియుచున్నది'.

అలా కలిసిన అతనిపై అద్భుతమైన అభిమానము కలిగెను. వారిద్దరూ విశ్వాసముతో మాట్లాడుకొనసాగిరి. వానరవీరుడు హనుమంతుడు శోకముతో దైన్యస్థితిలో నున్న సీత దగ్గరకు వృక్షముదిగి వచ్చుచుండెను. అలా హనుమంతుడు దగ్గరకు వచ్చుచున్నకొలదీ సీతకు అతడు రావణుడా అని శంక కలిగెను. ' అయ్యో ఇతడు రూపము మార్చుకొని వచ్చిన ఆ రావణుడే అయితే ఇతనికి నేను చెప్పినమాటలతో, చేయరాని పని చేసితిని' అని అనుకొనెను. ఆ అలోచనతో అందమైన అవయవములు కల ఆమె అశోకవృక్షముల శాఖలను వదిలి శోకముతో నిండినదై భూమిమీద కూలబడెను.

ఆ మహాబాహువులు కల హనుమంతుడు దుఃఖములో మునిగియున్న భయపడియున్న జనకాత్మజను చూచి వందనము చేసెను. భయముతో వణుకుచున్న ఆమె అతని వైపు కూడా చూడలేదు. ఆ చంద్రునివంటి ముఖముకల సీతా దీర్ఘముగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను విడచుచూ వందనము చేసిన వానరుని తో మధురమైన స్వరముతో ఇట్లు పలికెను.

'నీవు స్వయముగా మాయవి రావణుడవైతే, మాయతో ప్రవేశించి మరల నాకు సంతాపము కలిగిస్తున్నావు. అది శుభకరము కాదు. స్వరూపమును త్యజించి పరివ్రాజక రూపములో జనస్థానములో నాచేత చూడబడిన రావణుడవు నీవే. ఓ కామరూపము ధరించగల నిశాచరుడా, ఉపవాస దీక్షలో కృశించిన దీనురాలను నాకు మరల సంతాపము కలిగించుటకు నీకు తగదు. లేక నాకు కలిగిన ఈ శంక నిజము కాదేమో. నీ దర్శనముతో నా మనస్సుకి ప్రీతి కలుగుచున్నది. నీవు రాముని దూతవే అయితే నీకు మంగళమగు గాక. ఓ వానరులలో శ్రేష్ఠుడా నాకు ప్రియమైన రామకథను గురించి అడుగుతున్నాను. ఓ వానరుడా నా ప్రియుడగు రాముని గుణములు చెప్పుము. ఓ సౌమ్యుడా పొంగి పొరుచున్న నది ఒడ్డును హరించిన విధముగా నా మనస్సును హరిస్తున్నావు'.

' ఇది స్వప్నము యొక్క సుఖము. అపహరింపబడి తీసుకురాబడి నేను రాఘవునిచేత పంపబడిన వనచరుని మాత్రమే చూచుచున్నాను. స్వప్నమే అయినా లక్ష్మణునితో కూడిన రామును చూచినచో కష్టములను దాటకలను. కాని స్వప్నముకు కూడా నాపై దయలేదు. నేను ఇది స్వప్నము అనుకోను. వానరుని స్వప్నములో చూచినచో అభ్యుదయము కలగదు. కాని నాకు ఆనందముతో అభ్యుదయము ప్రాప్తించి నట్లేయున్నది'.

'ఇది చిత్త మోహమా? ఇది వాతము వలన కలిగినది కాబోలు. ఇది ఉన్మాదమో వికారమో. ఇది ఎండమావిలాంటిది ఏమో. కాని ఉన్మాదముకాదు ఉన్మాద లక్షణము కాదు. నేను వానరుని ప్రత్యక్షముగా చూచుచున్నాను'. సీత ఈ విధముగా అనేక విధములుగా, అలోచనల బలాబలములను గురించి తర్కించి, అతడు కామరూపము ధరించిన రాక్షసాధిపుడే అని తలచెను.

అప్పుడు ఆ సన్నని నడుము కల జనకాత్మజ ఈ విధముగా ఆలోచించి వానరునితో మాట్లాడకుండా ఉండెను. మారుతాత్మజుడగు హనుమంతుడు సీతయొక్క ఆలోచనలను గ్రహించి వినుటకు తగిన మాటలతో ఆమెకు సంతోషము కలిగించెను.

' రాముడు అదిత్యునివలే తేజస్వి. చంద్రునివలె లోకమునకు అహ్లాదపరచువాడు. దేవుడు వైశ్రవణుని వలే అన్ని లోకములకు రాజు. విష్ణువువలె మహాకీర్తి గలవాడు. పరాక్రమశాలి. సత్యవాది. బృహస్పతి వలె మధురమైన మాటలు చెప్పగలడు. రూప సౌభాగ్యము గలవాడు. శ్రీమంతుడు మన్మధునివలె నుండు రూపము గలవాడు. తగిన సమయములో క్రోధము చూపువాడు. శిక్షింపతగిన వారిని శిక్షించువాడు. లోకములో శ్రేష్ఠుడైన మహారథుడు. లోకము ఎవరి బాహుచ్ఛాయలలో నడచునో అట్టి వాడు రాముడు. ఆట్టి రాఘవుని మృగరూపములో ఆశ్రమపదమునుంచి దూరముగా తీసుకుపోయి, శూన్యమైన అశ్రమపదమునుంచి నీవు అపహరింపబడితివి. దాని ఫలము నీవు చూచెదవు'.

' ఆ వీరుడు క్రొద్ధికాలములో రోషముతో ప్రయోగించబడిన మంటలుక్రక్కుతున్న బాణములతో యుద్ధములో రావణుని సంహరించును. నేను ఆయన చేత పంపబడిన దూతను. ఇక్కడకు నీకోసమై వచ్చినవాడను. నీ వియోగముతో దుఃఖములో మునిగియున్న ఆ రాముడు నీ కుశలములను అడుగుచున్నాడు. మహాతేజోవంతుడు అగు సుమిత్రానందనుడు మహాబాహువులు కల లక్ష్మణుడు అభివాదముచేసి నీ కుశలములను అడుగుచున్నాడు. ఓ దేవి రాముని సఖుడగు సుగ్రీవుడు అను పేరుగల వానరాధీశుడు అగు రాజు నీ కుశలములను అడుగుచున్నాడు'.

' ఓ వైదేహీ సుగ్రీవుడు లక్ష్మణులతో కలిసి రాముడు నిన్ను నిత్యము తలచుకుంటూ వుంటాడు. రాక్షసులవశమైన నీవు జీవించివుండుట మా అదృష్టము. మహాబలవంతుడైన రాముని లక్ష్మణుని కోటి వానరుల మధ్యలో నున్న అమిత తేజసము కల సుగ్రీవుని త్వరలో చూచెదవు. నేను సుగ్రీవుని మంత్రిని. హనుమంతుడని పేరుకలవాడను. మహాసాగరమును దాటి లంకానగరమును ప్రవేశించితిని. దురాత్ముడైన రావణుని తలపై కాలుపెట్టి నా పరాక్రమముతో నేను నిన్ను చూచుటకు ఇక్కడికి వచ్చితిని'.

'ఓ దేవీ నీవు అనుకొచున్నట్లు రావణుని కాను. ఈ విధమైన శంక వదలుము. నేను చెప్పినది శ్రద్ధగా వినుము'.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది నాలుగవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్ ||